పెద్దశేష వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి కటాక్షం
పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి దివ్య కటాక్షం
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన ఆదివారం సాయంత్రం 7 గంటలకు, స్వామివారు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా పరమపద వైకుంఠ నారాయణుడి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుగా కదులుతుండగా, మంగళ వాయిద్యాల నాదాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల మధ్య స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని సేవించారు.
శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం అన్నీ తానే అయి శేషశాయి అనే పేరుకు సార్థకతను చాటుతున్నాడు. శేషుణ్ణి దర్శించే భక్తులను కాపాడుతానని, శేషుని వలె నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు సందేశం ఇస్తున్నారు.
ఈ వాహనసేవలో టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, కంకణబట్టార్ శ్రీ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కటాక్షం పొందారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి